NIGAMA MEDIA (P) LTD
9.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక.. దానం మళ్లీ బరిలో?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

అనర్హత వేటుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన దానం నాగేందర్‌
సుప్రీంకు వెళ్లబోనన్న ప్రకటన
ఉప ఎన్నిక వస్తే తానే పోటీ చేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే.
బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారనున్న పోరు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: 

ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. దీంతో తదుపరి ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్‌ తరఫున 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం సుదీర్ఘ న్యాయపోరాటానికి దారితీసింది.

రెండేళ్ల న్యాయపోరాటానికి తెర

దానం నాగేందర్‌ అనర్హత అంశంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా న్యాయపోరాటం చేశారు. స్పీకర్‌ దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనబెట్టి దానం నాగేందర్‌ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ అనర్హత 2024 ఏప్రిల్‌ 23 నుంచి అమల్లోకి వస్తుందని తీర్పులో పేర్కొంది.

దానం వ్యూహం ఏమిటి?

హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం దానం నాగేందర్‌ స్పందిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై తాను ఆలోచించలేదని, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగుతారా? అన్న చర్చకు తెరలేచింది. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న దానం నాగేందర్‌ ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్‌లో మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే ఆయన రాజకీయ జీవితంలో మరో కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌కు రాజకీయ పరీక్ష

దానం నాగేందర్‌ పార్టీ మార్పు, అనర్హత వ్యవహారాన్ని బీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ రాజకీయంగా ప్రస్తావిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నిక జరిగితే.. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రచార అంశంగా తీసుకునే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు మరో సవాల్‌

మరోవైపు అధికార కాంగ్రెస్‌కు ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయంగా కీలకంగా మారనుంది. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ తరఫున మళ్లీ పోటీ చేస్తే.. ఆయన వ్యక్తిగత రాజకీయ అనుభవంతో పాటు పార్టీ మార్పు అంశం కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తన అభ్యర్థిత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక జరిగితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే మరో కీలక ఉప ఎన్నికగా నిలవనుంది. దీంతో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలకు కూడా ఈ ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.