ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
ఫార్మర్ ఐడీ ఉన్న రైతులకే బుకింగ్ అవకాశం
మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మండల పరిధిలో రైతులు ఇకపై యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక యాప్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదని, దాని స్థానంలో “ఫ్రేమ్‌వర్క్ ఫెర్టిలైజర్ సేల్” యాప్ ద్వారానే అన్ని రకాల ఎరువులను బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలిపారు. ఈ యాప్ ద్వారా యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ తదితర అన్ని రకాల రసాయన ఎరువులను సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉందని, రైతులు తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చని సూచించారు.
అయితే, ఈ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకోవాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు. ఫార్మర్ ఐడీ కలిగిన రైతులు మాత్రమే ఎరువుల బుకింగ్‌కు అర్హులని తెలిపారు. ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయని రైతులు వెంటనే తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి కోరారు. రైతులు ముందస్తుగా నమోదు పూర్తి చేసుకుంటే ఎరువుల బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆమె తెలిపారు.

