మందమర్రిలో రెండో రోజుకు చేరిన ఏఐటీయూసీ నిరాహార దీక్ష
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాంతిఖని మైన్‌కు చెందిన బ్రాంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ రత్నం ప్రవీణ్ నేతృత్వంలో పిట్ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి నిరాహార దీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడమే కాకుండా సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి నుంచి బొగ్గు, విద్యుత్ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే CSR, DMFT నిధుల పేరుతో ప్రతి సంవత్సరం సింగరేణి నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో శాంతిఖని మైన్ అసిస్టెంట్ సెక్రటరీ దాడి రమేష్, ఎస్కే మైన్ ట్రెజరర్ ఒడ్నాల శ్రీకాంత్, మైన్స్ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, ఫకృద్, రామకృష్ణ, అంజత్ ఖాన్, రామచందర్, మహంకాళి సంతోష్ కుమార్, జనార్ధన్, సాగర్, బాబా తదితరులతో పాటు సేఫ్టీ కమిటీ సభ్యులు, షిఫ్ట్ ఇన్చార్జిలు, అసిస్టెంట్ షిఫ్ట్ ఇన్చార్జిలు, టెంపుల్, క్యాంటీన్ కమిటీ సభ్యులు, పిట్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

