రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడాలి
తెలంగాణ జలహక్కుల పరిరక్షణకు రాజీపడే ప్రసక్తే లేదు
పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్ (పెద్దపల్లి):
నాగార్జునసాగర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు. గురువారం పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంత కీలకమైన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? లేక రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పనులు కొనసాగుతున్నాయా? అనే విషయాలను ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇంత భారీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటని నిలదీశారు. తెలంగాణ జలహక్కులు, సాగునీటి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయ మౌనం పాటించడం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడమేనని కొమురయ్య యాదవ్ విమర్శించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, నిర్మాణ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు తేలితే తక్షణమే వాటిని నిలిపివేయాలని కోరారు. తెలంగాణ ప్రజల నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రశ్నిస్తామని, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని సలేంద్ర కొమురయ్య యాదవ్ స్పష్టం చేశారు.

