సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిరాహార దీక్షలు
ఆర్‌ఎల్‌సీ సమక్షంలో అంగీకరించిన 24 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట రెండు రోజుల నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ ఎండీ అక్బర్ అలీ, బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్ మాట్లాడుతూ సింగరేణిలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహించి ప్రభుత్వంపై, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. అయినప్పటికీ రాజకీయ జోక్యంతో సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు.
కార్మికుల 30 ప్రధాన డిమాండ్లతో సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామని, సమ్మెకు కార్మికులు సిద్ధమవుతున్న సమయంలో హైదరాబాద్‌లో ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్య డైరెక్టర్లు, యూనియన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ఆ చర్చల్లో 24 డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకారం కుదిరినా, వాటిని సర్క్యులర్ రూపంలో విడుదల చేసి అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడంతో కూల్‌బెల్ట్ ప్రాంతంలో కార్మికుల ప్రతిఘటనను ఎదుర్కొందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా కార్మిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రానున్న ఎన్నికల్లో కార్మికవర్గం తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు.
ప్రధానంగా పెర్క్స్‌పై ఇన్‌కమ్‌ట్యాక్స్‌ను కోల్‌ఇండియా తరహాలో అమలు చేయాలని, కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు సహకరించాలని, నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి పాత విధానంలో 80 శాతం అన్‌ఫిట్ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులకు రాజకీయ జోక్యం లేకుండా నియామక పత్రాలు అందించాలని కోరారు. సింగరేణి నుంచి జెన్‌కో, ట్రాన్స్‌కోకు సరఫరా చేసిన బొగ్గు, విద్యుత్‌కు సంబంధించిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యం అంగీకరించిన 24 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
అదేవిధంగా శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్, ఇల్లందు ఓసీ-3 వంటి ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు సింగరేణికే దక్కేలా ప్రభుత్వం, యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరాహార దీక్షలో బ్రాంచ్ నాయకులు కంది శ్రీనివాస్, టేకుమట్ల తిరుపతి, పెద్దపల్లి బానయ్య, ఎక్కేటి రాజేశ్వరరావు, స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు సీవీ రమణ, గోపతి సత్యనారాయణ, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, సృజన గీతిక, చనమల్ల సుమలత, మర్రి కుమారస్వామి, సీఎచ్‌పీ శర్మ, శెట్టి రాజేందర్, పారిపెల్లి సంజీవ్‌కుమార్, రాజేష్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి తిరుపతి గౌడ్, ఆర్‌కేపీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, సీపీఐ పార్టీ కార్యదర్శి కామెర దుర్గరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు.

