ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి క్రీడాకారులు కోల్‌ఇండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ ఆకాంక్షించారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని ఎల్లందు క్లబ్‌లో సింగరేణి స్థాయి 62వ వార్షిక క్రీడోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న లాన్ టెన్నిస్ పోటీలను కేకే ఏజెంట్ ఖదీర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాగం మల్లేష్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రీడలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రతి సంవత్సరం ఏరియా, రీజినల్ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను కోల్‌ఇండియా స్థాయి పోటీలకు పంపడం అభినందనీయమన్నారు.
లాన్ టెన్నిస్ వేగం, ఏకాగ్రత, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే క్రీడ అని తెలిపారు. ఈ క్రీడ ద్వారా శరీర చురుకుదనం పెరగడంతో పాటు తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచన అభివృద్ధి చెందుతాయని అన్నారు. సింగరేణి తరఫున కోల్‌ఇండియా స్థాయిలో రాణించి సంస్థకు క్రీడా రంగంలో మంచి గుర్తింపు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ కార్తీక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్. శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శ్రీను, క్రీడాకారులు పాల్గొన్నారు.

