కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
కార్పొరేట్ ఎస్టేట్ జనరల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎస్. గోపాల రాజు తొలిసారిగా మందమర్రి ఏరియాకు విచ్చేయగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం మందమర్రి ఏరియా జీఎం కార్యాలయానికి చేరుకున్న గోపాల రాజుకు ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణతో పాటు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా కార్పొరేట్ ఎస్టేట్ జీఎంగా పదోన్నతి పొందిన గోపాల రాజుకు రాధాకృష్ణ అభినందనలు తెలిపారు.
అనంతరం ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. గోపాల రాజు ఎస్టేట్ జీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మందమర్రి ఏరియాకు రావడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ అభివృద్ధి, పురోగతికి అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, నిరంతర శ్రమతో విధులు నిర్వర్తించినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలమని అన్నారు.
ఉద్యోగ బాధ్యతల్లో ఎదురయ్యే సవాళ్లను సానుకూల దృక్పథంతో స్వీకరించి, సమర్థవంతంగా అధిగమిస్తూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. గోపాల రాజుకు ఉన్న సుదీర్ఘ అనుభవం, కృషి కార్పొరేట్ ఎస్టేట్ విభాగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో ఎస్టేట్ విభాగం మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, కేకే ఏజెంట్ ఖదీర్, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (పర్సనల్) సి.హెచ్. అశోక్‌తో పాటు ఏరియా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

