రాష్ట్ర మంత్రి డా : వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి, పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు–భూగర్భ శాఖ మంత్రి డా : వివేక్ వెంకటస్వామి అన్నారు.మంగళవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌వీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో క్యాతన్‌పల్లి, మందమర్రి ప్రాంతాలకు చెందిన నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మండల తహసీల్దార్ సతీష్, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సంధ్యారాణి, డీసీసీ ప్రతినిధి రఘునాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేకానంద మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గతంలో పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అర్హులకు ప్రస్తుతం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి కొత్తగా పింఛన్ కార్డులు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన నూతన చేయూత పింఛన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించిన వారికి అర్హత ఉంటుందని వివరించారు. వైకల్య ధ్రువీకరణ పత్రాల్లో లోపాలు ఉన్నవారు సంబంధిత వైద్య నిపుణుల కమిటీని ఆశ్రయించి అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు.
360 డిగ్రీల డేటా పరిశీలనలో అర్హులుగా గుర్తించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల పింఛన్లు పొందలేకపోతున్న వారి వివరాలను సరిచేసి, అర్హత ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అన్ని కేటగిరీల్లో అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో కూడా అర్హులైన వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

