బెల్లంపల్లిలో ‘జై శ్రీ రామ్’ బియ్యం కృత్రిమ కొరతపై ఆరోపణలు
ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలి
MCPIU పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి బెల్లంపల్లి పట్టణంలోని కొందరు బియ్యం వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారని MCPIU పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం దుకాణాల ముందు నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయిస్తామని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, ఆచరణలో మాత్రం వినియోగదారులకు బియ్యం అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా మంగళవారం బెల్లంపల్లిలోని MCPIU పార్టీ కార్యాలయంలో పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ.. అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో బియ్యం దుకాణాల ముందు ఏర్పాటు చేసిన ధరల బోర్డుల వద్ద ఫొటోలకు పోజులిస్తూ నిబంధనలు పాటిస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. అయితే వినియోగదారులు బియ్యం కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటోందన్నారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే ‘జై శ్రీ రామ్’ (JSR) రకం సన్న బియ్యం కావాలని అడిగితే, ప్రస్తుతం బియ్యం అందుబాటులో లేదంటూ కొందరు వ్యాపారులు సమాధానం ఇస్తున్నారని తెలిపారు. గోదాముల్లో నిల్వలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు విక్రయిస్తే లాభాలు తగ్గుతాయనే ఉద్దేశంతోనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
కేవలం ప్రచారం కోసం, అధికారులను మభ్యపెట్టేందుకు ధరల బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించాలని పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని అన్ని బియ్యం దుకాణాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వలను పరిశీలించాలని కోరారు. అక్రమ నిల్వలు గుర్తించినా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు ‘జై శ్రీ రామ్’ బియ్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రజల తరఫున MCPIU పార్టీగా కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, రాజేష్, ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.

