కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి సింగరేణి పాఠశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాముఖ్యత, తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించారు. తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందిన చారిత్రక పరిణామాలు, ప్రజలు సాగించిన పోరాటం, వారి త్యాగాలు, స్వాతంత్ర్య ప్రాధాన్యత తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు.
తెలంగాణ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, గతంలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు, హక్కుల కోసం వారు చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, ప్రజా హక్కుల విలువలను విద్యార్థులు అర్థం చేసుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

