NIGAMA MEDIA (P) LTD
23.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, August 17, 2026

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆగస్టు 24 నుంచి సమ్మెకు
మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సంఘం హెచ్చరిక

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం మందమర్రి పాత బస్టాండ్‌లో సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సమ్మెకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు మొయ్య రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 21 ఆటో, ఓలా, ఉబర్ తదితర సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర జాక్ పిలుపు మేరకు ఆగస్టు 17న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి వినతిపత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఆగస్టు 17న కలెక్టర్ కార్యాలయ ముట్టడి

మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులంతా ఆటోలతో మందమర్రి నుంచి ర్యాలీగా తరలివెళ్లి కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాంబాబు పిలుపునిచ్చారు. ఆగస్టు 23వ తేదీలోగా ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే 24వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఫ్రీ బస్‌తో ఉపాధి దెబ్బతింది

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.12 వేల ఆర్థిక సహాయ పథకం కూడా ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. ఉచిత పథకాల స్థానంలో విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను అందిస్తే తాము కష్టపడి జీవించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవడంతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని, తమ పోరాటానికి ప్రజల మద్దతు కూడగడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.