కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని పొన్నారం గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ పెంచాల మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భరోసా కల్పించడంతో పాటు, ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈఓ గణపతి, మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ, కార్యక్రమం అమలు తీరును వివరించారు.
గ్రామ సర్పంచ్ పెంచాల మధు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి చేరవేయడంలో ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెంచాల అమృత రాజలింగు, వార్డు సభ్యులు, మండలంలోని పలువురు గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి జీవన్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బానోత్ నీలాయ, మండల ఉపాధ్యక్షుడు మా సంతోష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

