కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ఈ నెల 21న నిర్వహించనున్న మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో ముదిరాజ్ సోదరులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రెస్మీట్లు, సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధనపై చర్చించాలని ఒక ప్రకటనలో కోరారు.
గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ముదిరాజ్ సోదరులకు చేప పిల్లల పంపిణీ చేపట్టడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, మత్స్యకారుల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గ్రామస్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
మత్స్యకారులకు రావాల్సిన హక్కులు, ప్రభుత్వ పథకాలు, రాయితీలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి మత్స్యకారుల ఐక్యతను చాటాలని కోరారు. మత్స్యకారుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని, ఈ నెల 21న మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని కొరవి నర్సింలు ముదిరాజ్ సోదరులకు విజ్ఞప్తి చేశారు.

