టీడీపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని తెలుగుదేశం పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. బుధవారం మందమర్రిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ ఉద్యమం పేరుతో 1,250 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే, వారి త్యాగాల ఫలితాలను కేసీఆర్ కుటుంబం, ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే అనుభవించారని వాసాల సంపత్ విమర్శించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలకే పరిమితమవుతున్నారని అన్నారు. అయితే యువతకు మాత్రం ఉద్యోగ అవకాశాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందమర్రి ప్రాంతంలోని సోలార్ పవర్ ప్లాంట్లలో స్థానికేతరులకు ఉద్యోగాలు, వసతులు, భద్రత కల్పిస్తున్నారని, మరోవైపు సింగరేణిలో తల్లిదండ్రులు పనిచేసిన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం కారణంగా కొందరు యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, సంబంధిత సంస్థలు వెంటనే స్పందించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాసాల సంపత్ డిమాండ్ చేశారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగితే చెన్నూర్ టీడీపీ ఇన్చార్జి బి. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్యతో పాటు బొంగరాల రమ్య, శ్రీధర్, గుర్రాల చిన్న భూమయ్య, చందు, నిఖిల్, రాజేష్, ముని, అప్ప, పప్పీ, బబ్లు, బన్నీ, శివ, సందీప్, నవ్య, అనూష తదితరులు పాల్గొన్నారు.

