సింగరేణి గనులు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలి
శ్రావణపల్లి, కోయగూడెం గనులను సింగరేణికే కెటాయించాలి
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణలోని సింగరేణి పరిధిలో ఉన్న మందమర్రి ఏరియాకు చెందిన శ్రావణపల్లి, ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసీ-3 గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడం కార్మిక వర్గంలో ఆందోళన కలిగిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న నిర్వహించనున్న వేలం ప్రక్రియలో ఈ రెండు గనులు ప్రైవేటు కంపెనీలకు దక్కే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే సింగరేణి భవిష్యత్తుతో పాటు వేలాది మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. శనివారం మందమర్రిలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మందమర్రి ఏరియాలో ఇప్పటికే రెండు గనులు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని, కొత్త గనులు సింగరేణికి కేటాయించకపోవడంతో సంస్థలో కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మందమర్రి ప్రాంతానికి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రావణపల్లి, కోయగూడెం గనులను సింగరేణి సంస్థకే కేటాయించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సత్తుపల్లి, కోయగూడెం గనులు అరబిందో, అవంతిక వంటి ప్రైవేటు సంస్థలకు దక్కకుండా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టామని గుర్తుచేశారు. సింగరేణి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తే కార్మిక వర్గం సహించబోదని స్పష్టం చేశారు. శ్రావణపల్లి గని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళితే ఆ ప్రాంతంలో భూములు, ఆస్తులు కోల్పోయే నిర్వాసితులకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగదని, తగిన నష్టపరిహారం కూడా అందే అవకాశం ఉండదని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గని నిర్వహణ జరిగితే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ రెండు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వేలం ప్రక్రియలో ప్రైవేటు కంపెనీలు పాల్గొనకుండా చూడాలని, గనులను సింగరేణికే కేటాయించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి……
పదవీ విరమణ పొందిన, వైద్య కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీతారామయ్య విమర్శించారు. కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ బోర్డును ఎక్కడైనా ఏర్పాటు చేసి అర్హులైన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొమురయ్య హయాంలో కుదిరిన ఒప్పందాలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడం, కొత్త గనులను సంస్థకు కేటాయించడం, కార్మికుల హక్కులను పరిరక్షించడం కోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మందమర్రి ఏరియాకు చెందిన పలువురు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

