బిఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ తీవ్ర ఆరోపణలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ, సుమారు 35 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు, రాజకీయంగా తనకు అండగా నిలిచిన కుటుంబాలకు తనవంతు సేవలు అందించానని బీఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ తెలిపారు. తాను ఎప్పుడూ రాజకీయపరమైన విమర్శలే చేశానని, వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేసిన సందర్భం లేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద్ (వివేక్ వెంకటస్వామి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మందమర్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మద్ది శంకర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం 45 వేల ఉద్యోగాలు, మూడు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, సిరామిక్ పరిశ్రమ, మైనింగ్ యూనివర్సిటీ, సింగరేణిలో కొత్త భూగర్భ గనులు, మందమర్రిలో 100 పడకల ఆసుపత్రి వంటి అనేక హామీలు ఇచ్చారని, అయితే ఇప్పటివరకు వాటిలో ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకు రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు.
తన విషయంలోనూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని మద్ది శంకర్ ఆరోపించారు. తనకు సంబంధం లేని సింగరేణి క్వార్టర్‌ను ఖాళీ చేయించేందుకు అధికారాన్ని ఉపయోగించారని, తాను, తన భార్య కలిసి వేడుకున్నా పట్టించుకోకుండా పది రోజులపాటు తిప్పించుకొని బలవంతంగా క్వార్టర్ ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో తాను మూడు వంతుల ఖర్చు భరించగా, మంత్రి తరఫున ఒక వంతు మాత్రమే సహాయం అందిందని పేర్కొన్నారు. అయినప్పటికీ తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన విషయాన్ని విస్మరించి, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. దళితబంధు కోసం పార్టీ మారానంటూ తనను అవమానిస్తున్నారని, జీతం ఇచ్చానని, పెద్ద ఎత్తున సహాయం చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని, తనపై చేసిన ఆరోపణల్లో ఏది నిరూపించినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో తన ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా మంత్రి పేరు నిలబెట్టేందుకు పోటీ చేశానని, పార్టీ కోసం మంత్రి ఇచ్చిన డబ్బులతోపాటు తన సొంత భూమిని సైతం అమ్ముకొని ఎన్నికల్లో ఖర్చు చేశానని తెలిపారు. అయినప్పటికీ మంత్రి ఒక్కరోజు కూడా ప్రచారానికి రాలేదని ఆరోపించారు. ప్రేమ్‌సాగర్‌రావు పార్టీలో పోటీ చేస్తున్నందున తాను రానని చెప్పినప్పటికీ, వంశీని ప్రచారానికి పంపాలని కోరినా పంపలేదన్నారు. అదే వంశీ ఎంపీ టికెట్ కోసం, ఆయన గెలుపు కోసం మాత్రం ప్రేమ్‌సాగర్‌రావు వద్దకు వెళ్లి ప్రచారం చేశారని విమర్శించారు. సామాన్య కార్యకర్తలకు ఒక న్యాయం, తమకు మరో న్యాయమా? ఇదేనా మీ రాజకీయ సంస్కృతి? అని మంత్రి వివేకానంద్‌ను మద్ది శంకర్ ప్రశ్నించారు.ఈ విలేకరుల సమావేశంలో కనకం రవీందర్, దాసరి రాజనర్సు, బండ రవి, ముల్కల రమేష్, మొగురం శ్రీనివాస్, శనిగారపు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

