మహిళలకు ఆటల పోటీలు, గ్రూప్ డ్యాన్స్‌లు,
ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు
మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం, ఆనందాన్ని నింపేందుకు మందమర్రి ఏరియా సిఈఆర్ (CER) క్లబ్‌లో ఈ నెల 14వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ‘ఫ్యామిలీ డే – ఆట పాట’ వినోదాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్ ఆదివారం తెలిపారు.
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మహిళల కోసం వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు, సాంస్కృతిక ప్రతిభను చాటేలా గ్రూప్ డ్యాన్స్ పోటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రూప్ డ్యాన్స్‌లో గరిష్ఠంగా ఎనిమిది మంది సభ్యులు పాల్గొనే అవకాశం కల్పించారు. అలాగే, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మలను అందంగా పేర్చిన వారిలో ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నారు.
కార్మికులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరై, వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ‘ఫ్యామిలీ డే – ఆట పాట’ వేడుకలను విజయవంతం చేయాలని డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్ కోరారు. మందమర్రి ఏరియా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

