మందమర్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నల్లజెండాలతో నిరసన
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోల్‌బెల్ట్ ప్రాంత రహదారులపై నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మందమర్రి మార్కెట్ ఏరియాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మందమర్రి బస్టాండ్ వద్ద నల్లజెండాలు ప్రదర్శిస్తూ నినాదాలతో నిరసన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను ప్రకటించి, కార్మికులకు వాటా అందించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి గొప్పలు చెప్పే ప్రజాప్రతినిధులు, ఇప్పుడు గత ఆర్థిక సంవత్సర లాభాలను ప్రకటించే విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. యాజమాన్యంపై రాజకీయ జోక్యం పెరుగుతోందని, గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు తమ శ్రమను, ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేస్తూ సంస్థకు లాభాలు తీసుకొస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. అయితే గత రెండేళ్లుగా అభివృద్ధి నిధుల పేరుతో కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలను పక్కనపెడుతున్నారని ఆరోపించారు. కనీస రక్షణ పరికరాలు సైతం అందించలేని పరిస్థితికి కార్మికులను నెట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి డివిడెండ్ ప్రకటించడంలో చూపుతున్న శ్రద్ధ, కార్మికుల కష్టానికి తగిన లాభాల వాటా ప్రకటించడంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
సింగరేణి లాభాలపై పలు కార్మిక సంఘాలు తమదైన శైలిలో నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. కార్మిక వ్యతిరేక విధానాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఒకే విధంగా ఉందని విమర్శించారు. గతంలో సింగరేణి లాభాలపై హడావుడి చేసిన నాయకులు ప్రస్తుతం ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.గత వారం రోజులుగా వివిధ కార్మిక సంఘాలు గనుల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వాలు స్పందించకపోవడం సరికాదన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పారిశ్రామిక సంబంధాలు దెబ్బతిని, బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలంగా లాభాల వాటాను ప్రకటించి అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు దెబ్బటి శ్రీనివాస్, లింగాల సత్యనారాయణ, జడల ప్రవీణ్, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ ధనిశెట్టి సురేష్, పిట్ సెక్రటరీలు నాగవెల్లి శ్రీధర్, బుద్ధ సురేష్, పసునూటి శ్రీకాంత్, బెతి భరత్‌తో పాటు వివిధ పిట్ కమిటీల సభ్యులు, స్వచ్ఛందంగా పాల్గొన్న కార్మికులు, సోషల్ మీడియా ఇన్‌చార్జి కలవల శ్రీనివాసులు పాల్గొన్నారు.

