కార్పొరేషన్ కౌన్సిల్లో అధికారిక తీర్మానం చేయాలి
బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించి, అనుమతులు మంజూరు చేయడంతో పాటు కార్పొరేషన్ కౌన్సిల్లో అధికారిక తీర్మానం చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కోరారు.ఈ మేరకు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పు సాధ్యమని విశ్వసించిన పూలే.. మహిళలకు విద్యను అందించేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
పూలే విగ్రహ ఏర్పాటు కేవలం ఒక విగ్రహ ప్రతిష్ఠాపన కాదని, అది సామాజిక న్యాయం, సమానత్వం, బహుజన ఆత్మగౌరవానికి ఇచ్చే గౌరవానికి ప్రతీక అని నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. గత పదేళ్లుగా చేస్తున్న విజ్ఞప్తిని మేయర్, కార్పొరేషన్ పాలకవర్గం సానుకూలంగా పరిగణించి, స్థలం కేటాయించడంతో పాటు కౌన్సిల్లో తీర్మానం చేసి విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు వెల్ది సుదర్శన్, బీసీ సమాజ్ జిల్లా నాయకులు కర్ణకంటి రవీందర్, విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజాచారి, బీసీ సమాజ్ జిల్లా నాయకులు బియ్యాల సత్తయ్య, జక్కం రవీందర్, పెద్దపల్లి సూరయ్య, సంద ప్రభాకర్, మాడిశెట్టి మహేష్, కొండు రాజు, చల్ల విజయ్‌కుమార్, తాటిపాముల సమ్మయ్య, వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్, ముదెపల్లి రమేష్, వేముల నాగరాజు, పల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

