NIGAMA MEDIA (P) LTD
3.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 25, 2026

మెరిసేలా మందమర్రి.. మురిసేలా అభివృద్ధి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పనులకు రూ.1.93 కోట్లతో శ్రీకారం
అదనంగా రూ.15 కోట్ల నిధులు మంజూరు
పేదలకు ఇళ్ల కోసం 7 ఎకరాల భూమి గుర్తింపు
జర్మన్ భాష శిక్షణ పొందిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

రానున్న రెండేళ్లలో మందమర్రి పట్టణంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించి, పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.బుధవారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో రూ.1.93 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

పలు వార్డుల్లో రోడ్డు పనులకు శ్రీకారం………

మందమర్రి మున్సిపాలిటీ 23వ వార్డులోని లక్ష్మీ భవానీ కాలనీలో రూ.58 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. 3వ వార్డులో ఖబ్రస్తాన్ వరకు రూ.76 లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ సీసీ రోడ్డు, 19వ వార్డులో రూ.59 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్డు, 2వ, 22వ వార్డుల్లో రూ.52 లక్షలతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే వారి సమస్యలు, అవసరాలు తెలుస్తాయని అన్నారు. మందమర్రి పట్టణంలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అత్యవసరమైన పనులను ముందుగా పూర్తి చేస్తామని చెప్పారు.

పేదలకు ఇళ్ల కోసం 7 ఎకరాల భూమి గుర్తింపు……..

మందమర్రి ప్రాంతం ఏజెన్సీ పరిధిలో ఉండటం, ప్రభుత్వ భూముల కొరత కారణంగా అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థతో చర్చించి సుమారు 7 ఎకరాల భూమిని గుర్తించామని, అక్కడ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే మందమర్రిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం సుమారు రూ.3 కోట్లతో రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా లాటరీ విధానంలో ఎంపిక చేసి ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు.

సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు……..

ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

50 పడకల ఆసుపత్రికి కృషి…….

మందమర్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని, విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఆర్‌కే ఓపెన్‌కాస్ట్ పరిధిలో కొత్త గని ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మందమర్రిలో జర్మన్ భాషా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

జర్మన్ భాష నేర్చుకుంటే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు….

అనంతరం మందమర్రిలో టామ్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులను మంత్రి సందర్శించారు. ఆరు నెలలుగా శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ప్రస్తుతం బి-1 స్థాయి శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు బి-2 స్థాయిని కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించడంతో పాటు అవసరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లకు పైగా పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ ప్లేస్‌మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. శిక్షణ మధ్యలో నిరుత్సాహపడకుండా పట్టుదలతో కొనసాగాలని, నేర్చుకున్న ప్రతి నైపుణ్యం భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుందని సూచించారు. జర్మన్ భాషా శిక్షణ పొందిన వారికి టామ్‌కామ్‌లో శిక్షకులుగా అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.

అదనంగా రూ.15 కోట్ల నిధులు మంజూరు……..

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మందమర్రి మున్సిపాలిటీలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం మంత్రి గడ్డం వివేకానంద ప్రత్యేక చొరవతో అదనంగా రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ పూర్తిచేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. అమృత్ పథకం కింద చేపట్టిన అంతర్గత తాగునీటి పైపులైన్ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ముల్కల్ల నుంచి గోదావరి నీటిని తీసుకువచ్చే పైపులైన్ మందమర్రి వరకు చేరుకుందని, కనెక్షన్ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ తెలిపారు.

దశలవారీగా సమస్యల పరిష్కారం……..

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తిచేసి, అవసరమైన రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. సింగరేణికి చెందిన సుమారు 7 ఎకరాల భూమిని గుర్తించి, ఏజెన్సీ ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇళ్లు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, గృహ వసతి, రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.