యువత మారథాన్‌లలో పాల్గొనాలి
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి
మందమర్రి ఎస్‌ఐ గోపతి నరేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో వ్యాయామం, రన్నింగ్, వాకింగ్‌ను తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని మందమర్రి పట్టణ ఎస్‌ఐ గోపతి నరేష్ సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీలో జీటీఆర్ ఫౌండేషన్, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫారెస్ట్ ట్రైల్ రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ గోపతి నరేష్‌తో పాటు మందమర్రి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పరుగులు తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. నడక, పరుగు వంటి శారీరక వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా యువత క్రీడలు, మారథాన్‌లు, రన్నింగ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించే ఫారెస్ట్ ట్రైల్ రన్ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్‌ఐ గోపతి నరేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి రన్నర్స్ సభ్యులు ముడారపు అనిల్, రామంచ తిరుపతి, మ్యాజిక్ సాయి, శ్రీరాముల వెంకటేష్, డాక్టర్ రవి, గోపికృష్ణ, జక్కుల ప్రసాద్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

