మందమర్రిలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులతో బాల్క సుమన్ సమావేశం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఈ నెల 14వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభకు మందమర్రి ఏరియా నుంచి కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
సింగరేణి కార్మిక గర్జన సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, ఆదివారం మందమర్రి పట్టణంలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులతో బాల్క సుమన్ సమావేశం నిర్వహించారు. సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. సభకు కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ మందమర్రి ఏరియా నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు దాని అనుబంధ సంఘాల నాయకులు, టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా, కేంద్ర, రాష్ట్ర కమిటీల బాధ్యులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

