17 పతకాలతో సత్తాచాటిన గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు
3 స్వర్ణాలు, 4 రజతాలు, 10 కాంస్య పతకాల కైవసం
కోల్ బెల్ట్ స్పోర్ట్స్ :
ఆసిఫాబాద్‌లోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం (22వ తేదీ) నిర్వహించిన ఏడవ జాతీయస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో మందమర్రి గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. మాస్టర్ కె. సంతోష్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ షావలిన్ కుంగ్‌ఫూ డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, కుంగ్‌ఫూ డు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు ఘనంగా నిర్వహించారు.
ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో పాల్గొన్న మందమర్రి గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు 3 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు, 10 బ్రాంజ్ పతకాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విషయాన్ని మాస్టర్ జెట్టి కృష్ణ, గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ వెల్లడించారు.
పతకాలు సాధించిన విద్యార్థినులను మందమర్రి పట్టణ ఎస్సై నరేష్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యతోపాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ సాధన ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు తమ ఆత్మరక్షణ కోసం కుంగ్‌ఫూ, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యలను నేర్చుకోవడం ఎంతో అవసరమని సూచించారు.విజేతలుగా నిలిచిన విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

