కార్మికులకు 40 శాతం లాభాల వాటా ఇవ్వాలి..
దీపావళికి ముందే పీఎల్‌ఆర్ బోనస్ చెల్లించాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గని డిపార్ట్మెంట్ల వద్ద మేనేజర్లకు వినతిపత్రాలు
9న హైదరాబాద్‌లో జెన్కో హెడ్ ఆఫీస్ ముట్టడి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సంస్థ ఆర్థిక పరిరక్షణకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం అన్ని గనులలోని వివిధ డిపార్ట్మెంట్ల ఆవరణలో గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గనుల మేనేజర్లు, డిపార్ట్మెంట్ అధికారులకు కార్మికుల సమస్యలు, సంస్థ ఆర్థిక అంశాలతో కూడిన మెమోరాండాలను అందజేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి………
సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్న బకాయిలను ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా విడుదల చేయాలని కోరారు. అదే విధంగా తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా తదితర రంగాల్లో కీలకంగా సేవలందిస్తున్నప్పటికీ, సంస్థకు రావాల్సిన బకాయిల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. బకాయిలను సకాలంలో చెల్లిస్తే సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతమై కార్మికుల సంక్షేమంతో పాటు ఉత్పత్తి, భద్రతా చర్యలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా ఇవ్వాలి…….
ఈ ఏడాది సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 40 శాతం వాటాను కార్మికులకు అందజేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సంస్థ లాభాల్లో కార్మికుల శ్రమ కీలకమని, అందువల్ల వారికి రావాల్సిన న్యాయమైన వాటాను అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. దసరాకు ముందే లాభాల వాటా ప్రకటించి చెల్లించాలని, దీపావళి పండుగకు ముందే కార్మికులకు పీఎల్‌ఆర్ బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు చెల్లింపులకు అవసరమైన నిధులను యాజమాన్యం, ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.
రక్షణ పరికరాలు వెంటనే అందించాలి……….
గనుల్లో విధులు నిర్వహించే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు కోరారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, పనిముట్లు, భద్రతా సామగ్రిని వెంటనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. గనుల్లో పనిచేసే కార్మికులకు నాణ్యమైన భద్రతా పరికరాలు అందించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అవసరమైన పరికరాలు, పనిముట్లు అందుబాటులో లేకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
9న జెన్కో హెడ్ ఆఫీస్ ముట్టడి……
తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న హైదరాబాద్‌లోని జెన్కో హెడ్ ఆఫీస్ ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంస్థకు రావాల్సిన బకాయిల సాధనతో పాటు సింగరేణిని మరింత లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.
కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం……
కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ ఆర్థిక పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భద్రతా ప్రమాణాల మెరుగుదలకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలు పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, ఎగేటి రాజేశ్వరరావు, కల్వల శ్రీనివాస్, పారిపెల్లి సంజీవ్‌కుమార్, సృజన గీతిక ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు సోమిశెట్టి రాజేశం, గోపతి సత్యనారాయణ, పెద్దపెళ్లి బానయ్య, ములకలపల్లి వెంకటేశ్వర్లు, సీవీ రమణతో పాటు పిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ప్రేమ్‌లాల్, జి. రాంబాబు, బి. రామన్న, సాధుల సంపత్, జువాది శ్రీనివాస్, ముద్దసాని కోటయ్య, మల్లేష్, తోట శ్రీనివాస్, సాధన వీణ ప్రభాకర్, డ్రైవర్ కుమారస్వామి, కన్నం వేణు, బైరి పోషాలు, ఊరకొండ శ్రీకాంత్, పున్నం శ్రీనివాస్, హేమచంద్ర, శెట్టి రాజేందర్, రామ్‌రెడ్డి, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్‌సింగ్, తోట వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


