మూసివేసిన కేకే-2 గని భూముల్లో తొలిసారిగా ఆయిల్‌పామ్ తోటల పెంపకం
2 హెక్టార్లలో 285 మొక్కల నాటిన మందమర్రి ఏరియా
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరో వినూత్న హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బొగ్గు తవ్వకాలు పూర్తయిన భూములను పునరుద్ధరించి, వాటిని పర్యావరణహితంగా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలన్న సంస్థ లక్ష్యంలో భాగంగా మందమర్రి ఏరియాలోని మూసివేసిన కేకే-2 (KK2) భూగర్భ గని ఆవరణలో తొలిసారిగా ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని ప్రారంభించారు.
సింగరేణి సంస్థ సీ&ఎమ్‌డీ డాక్టర్ బుధ ప్రకాష్ జ్యోతి దిశానిర్దేశంలో గనుల తవ్వకాలు పూర్తయిన ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయ-అటవీ (Agro-Forestry), ఉద్యానవన (Horticulture) పద్ధతులను ప్రోత్సహిస్తూ భూముల సద్వినియోగానికి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు, జీఎం ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ బి. సైదులు పర్యవేక్షణలో ఆయిల్‌పామ్ సాగుకు రూపకల్పన చేశారు.
2 హెక్టార్లలో 285 ఆయిల్‌పామ్ మొక్కలు
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ నాయకత్వంలో నర్సరీ వెనుక భాగంలో ఉన్న కేకే-2 మూసివేసిన గని భూమిలో సుమారు 2.00 హెక్టార్ల విస్తీర్ణంలో 285 ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. గనుల భూముల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం సింగరేణి చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు 135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో బొగ్గు గనుల భూముల్లో ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో మూసివేసిన గని భూములను కేవలం పచ్చదనంతో నింపడమే కాకుండా భవిష్యత్తులో ప్రత్యామ్నాయ వ్యవసాయ, ఉద్యానవన కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి.
అధికారుల ఆధ్వర్యంలో …….
ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ, జీఎం ఎస్‌ఓ జి.ఎల్. ప్రసాద్, శాంతిఖని ఏజెంట్ ఎస్. సంతోష్, కేకే గ్రూప్స్ ఏజెంట్ ఖాదిర్, కేకేఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. రాంబాబు, బెల్లంపల్లి రీజియన్ డీజీఎం (అటవీ) హరి నారాయణతో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు స్వయంగా ఆయిల్‌పామ్ మొక్కలను నాటి, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గనుల కార్యకలాపాలు ముగిసిన అనంతరం భూములను నిరుపయోగంగా వదిలివేయకుండా, వాటిని తిరిగి ప్రకృతి ఒడిలోకి తీసుకురావాలనే సింగరేణి విధానానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.
ఇతర గని ప్రాంతాలకు ఆదర్శంగా……..
బొగ్గు ఉత్పత్తి సంస్థగా మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, భూముల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు, స్థిరమైన అభివృద్ధి దిశగా సింగరేణి ముందుకు సాగుతోందని అధికారులు పేర్కొన్నారు. గనుల తవ్వకాల అనంతరం భూముల పునరుద్ధరణకు ఆయిల్‌పామ్ వంటి పంటలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ ప్రయోజనాలతో పాటు భవిష్యత్‌లో ఆర్థిక ప్రయోజనాలకు కూడా మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
కేకే-2 గని ప్రాంగణంలో ప్రారంభించిన ఈ ఆయిల్‌పామ్ తోటను సమర్థవంతంగా నిర్వహించి, దాని ఫలితాలను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో అవసరమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలను విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బొగ్గు ఉత్పత్తి–పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా సింగరేణి చేపడుతున్న ఈ కార్యక్రమం ఇతర గని ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని వారు ఆకాంక్షించారు. మూసివేసిన గని భూముల్లో పచ్చదనం పెంచడంతో పాటు వ్యవసాయ, ఉద్యానవన ఆధారిత వినియోగానికి భూములను సిద్ధం చేయడం ద్వారా “బొగ్గుతో అభివృద్ధి.. పచ్చదనంతో భవిష్యత్తు” అనే భావనను సింగరేణి ఆచరణలోకి తీసుకువస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు


