దీపావళి బోనస్ రూ.1,10,250
2025–26 ఆర్థిక సంవత్సరానికి బోనస్ చెల్లింపునకు అంగీకారం
హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కాలరీస్ కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా భారీ బోనస్ అందనుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 దీపావళి బోనస్ చెల్లించేందుకు JBCCI సమావేశంలో అంగీకారం కుదిరిందని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్‌కుమార్ లు మందమర్రి యూనియన్ కార్యాలయంలో శనివారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సమావేశం వివరాలను వివరించారు.

అక్టోబర్ 3న కోల్‌కతాలో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (SCWU–AITUC) నాయకులు ఈ సందర్బంగా తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర నాయకులు కామ్రేడ్ రామేంద్ర కుమార్, కామ్రేడ్ లలిత్ లాల్ పాల్గొన్నారని వారు వివరించారు.

కార్మికుల ప్రయోజనాల కోసం నిరంతర పోరాటం…….
సింగరేణి కార్మికుల మేలు కోసం ప్రతి సంవత్సరం బోనస్ పెంపుదలకు తమ యూనియన్ కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్మికుల మేలు కోసం బోనస్ పెంపుదలపై నిరంతరం పోరాడుతున్న కార్మిక సంఘాలను మాత్రమే గుర్తించాలని SCWU–AITUC నాయకులు కోరారు. కార్మికుల ప్రయోజనాల కోసం తమ యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని వారు స్పష్టం చేశారు. దీపావళి బోనస్‌గా రూ.1,10,250 చెల్లించడానికి కుదిరిన ఒప్పందం నేపథ్యంలో సింగరేణి కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

