దుమ్ము, దూళి.. బ్లాస్టింగ్ మందు వాసనతో ఇబ్బందులు
పగుళ్లతో దెబ్బతింటున్న ఇళ్లు, గోడలు, రేకులు
2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):
కాసిపేట మండలంలోని సోమగూడెం (కె) గ్రామ పరిధిలోని ట్యాంక్ బస్తీ, ఎన్టీఆర్ కాలనీ గ్రామస్తులు కెకె ఓపెన్‌కాస్ట్ (ఓసీ) బ్లాస్టింగ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఓసీ బ్లాస్టింగ్ కారణంగా భారీగా దుమ్ము, దూళి వ్యాపించడంతో పాటు బ్లాస్టింగ్ మందు వాసనతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు.
బ్లాస్టింగ్ సమయంలో వచ్చే ప్రకంపనల కారణంగా ఇళ్ల గోడలు, రేకులు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని, బ్లాస్టింగ్ ప్రభావంతో ఆస్తులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, దూళి కారణంగా పరిసరాలు కలుషితమవుతున్నాయని, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సోమగూడెం (కె) సర్పంచ్ కునుసోత్ చైతన్య ఆధ్వర్యంలో గ్రామస్తులు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. కార్యాలయంలోని ఏవో ఎండీ ఖాదర్‌కు వినతిపత్రం అందజేశారు.
కెకె ఓసీ బ్లాస్టింగ్ ప్రభావిత ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా ప్రకటించి, బాధిత కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ (పునరావాసం, పునరావాస పరిహారం) ప్యాకేజీ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజల భద్రత, నివాస హక్కులు, ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

