NIGAMA MEDIA (P) LTD
22.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 15, 2026

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

18లోగా హామీలు అమలు చేయకుంటే హైదరాబాద్ దిగ్భంధం
టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తోందని కవిత ఆరోపించారు. మాట తప్పడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్రేడ్‌మార్క్‌గా మారిందని విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరించడం సరికాదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి బానిసలు కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాల కంటే ఉద్యమానికే ప్రాధాన్యతనిచ్చి పోరాడారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగాలంటే ఉద్యోగుల సహకారం తప్పనిసరిగా అవసరమని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగులను అభివృద్ధిలో భాగస్వాములుగా, డెవలపర్లుగా గుర్తించే విధంగా భవిష్యత్‌లో తమ పార్టీ విధానాలు ఉంటాయని తెలిపారు.

ప్రభుత్వ విద్యా రంగం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కవిత.. రాష్ట్రంలో సుమారు 600 మండలాలు ఉండగా, కేవలం ఎనిమిది మంది మాత్రమే పర్మినెంట్ ఎంఈఓలు ఉన్నారని అన్నారు. దీంతో ప్రభుత్వ విద్య పర్యవేక్షణ దెబ్బతింటోందని పేర్కొన్నారు. హెడ్‌మాస్టర్లు, సీనియర్ ఉపాధ్యాయులనే ఎంఈఓలుగా నియమించడం, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసే రిపోర్టులు, ఇతర పనులు అప్పగించడం వల్ల విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతోందన్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని, ఉపాధ్యాయుల పదోన్నతులు, గురుకులాలు, డిగ్రీ కళాశాలల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు రావాల్సిన డీఏ 32 నెలలుగా పెండింగ్‌లో ఉందని కవిత ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు డీఏ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగుల పీఆర్సీ గడువు ముగిసే పరిస్థితి ఉన్నందున తక్షణమే 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2003లో నియమితులైన పోలీసులకు, ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ వర్తింపజేయాలని కవిత కోరారు. 2003లో నియమితులైన ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ అమలు చేస్తే ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్ల మేర ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఆ మొత్తంతో ఉద్యోగుల ఇతర బకాయిలను చెల్లించాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ పనిచేస్తున్నాయో ముఖ్యమంత్రి వెల్లడించాలని కవిత సవాల్ చేశారు. హెల్త్‌కార్డులు సక్రమంగా పనిచేస్తున్నాయని నిరూపిస్తే ప్రభుత్వం ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధమని, లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న పోరాటాలకు టీఆర్‌ఎస్ నైతిక మద్దతు ఇస్తుందని కవిత తెలిపారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై పోరాటం విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ సాధన కోసం తల్లి కాంగ్రెస్‌తో పోరాడి రాష్ట్రాన్ని సాధించామని, పిల్ల కాంగ్రెస్‌కు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 37 ప్రధాన అంశాలపై డిమాండ్లు చేస్తున్నాయని, వాటిలో చాలా వరకు ఆర్థిక అంశాలతో సంబంధం లేనివేనని కవిత పేర్కొన్నారు. ముఖ్యంగా 317 జీవో బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 317 జీవో బాధితుల్లో మహిళా ఉద్యోగులే అధికంగా ఉన్నారని, వారి సమస్యలు తనను బాధిస్తున్నాయని తెలిపారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. జీతాలు సకాలంలో అందకపోయినా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారు విధులు నిర్వహిస్తున్నారని, వారికి బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ నెల 18లోగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ దిగ్భంధానికి పిలుపునివ్వాలని కవిత సూచించారు. ఉద్యోగులు చేపట్టే ఉద్యమాలకు టీఆర్‌ఎస్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.