దేవదుర్గ బ్లాక్‌లో ఐదేళ్లలో అన్వేషణ పూర్తి
కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో ఒప్పందం
సింగరేణి చరిత్రలో మరో కీలక మైలురాయి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సింగరేణి సంస్థ అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ కోసం గతంలో కేంద్ర ప్రభుత్వ వేలంలో సింగరేణి లైసెన్స్‌ను పొందింది. తాజాగా అన్వేషణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఒప్పందాన్ని కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో కుదుర్చుకుంది. బెంగళూరులోని కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కర్ణాటక డీఎంజీ డైరెక్టర్ రంగప్ప, సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం దేవదుర్గ ప్రాంతంలోని 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజ అన్వేషణను ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అన్వేషణ కోసం ఇప్పటికే అధికారులను నియమించామని, త్వరలో మిగిలిన అధికారులు, సిబ్బందిని కూడా నియమించి రెండేళ్లలోపు జీ-4 (G4) స్థాయి అన్వేషణను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.
ఇతర రాష్ట్రంలో ఈ స్థాయిలో ఖనిజ అన్వేషణ చేపట్టడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్న ఆయన, 13 దశాబ్దాల అన్వేషణ అనుభవం కలిగిన సంస్థగా ఈ ప్రాజెక్టును కూడా విజయవంతంగా పూర్తి చేస్తామనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సహకరించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, మైన్స్ అండ్ జియాలజీ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్వేషణలో భాగంగా రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ మ్యాపింగ్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్కౌట్ డ్రిల్లింగ్ చేపడతామని తెలిపారు. అనంతరం సేకరించిన నమూనాలపై పెట్రోగ్రాఫిక్, మినరలాజికల్ అధ్యయనాలతో పాటు సమగ్ర మూలకాల విశ్లేషణను కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సింగరేణి జియోసైన్స్ ల్యాబొరేటరీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విశ్లేషణ అనంతరం సమగ్ర నివేదికను కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సమర్పిస్తామని, ఆ నివేదిక ఆధారంగా మరింత విస్తృత స్థాయి ఖనిజ అన్వేషణకు అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్స్‌ప్లోరేషన్ జీఎం పంకజ్ కులశ్రేష్ట, డీజీఎం (జియాలజీ) వి. రాజేశ్వర్, డీవైఎఫ్‌ఎం లక్ష్మీప్రియ, సీనియర్ లా ఆఫీసర్ ప్రభందిత తదితరులు పాల్గొన్నారు.

