NIGAMA MEDIA (P) LTD
6.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 7, 2026

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయ నీటి వనరులపై ప్రజెంటేషన్‌.
ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాని పని..
బస్వాపూర్‌ మీదుగా గోదావరి జలాలను మళ్లించాలి –
పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై డిమాండ్‌
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని డిండి రిజర్వాయర్‌ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయ నీటి వనరులపై సమగ్ర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు సాగునీటి అవసరాలను తీర్చాలంటే గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే మార్గమని స్పష్టం చేశారు. ఏదుల నుంచి డిండికి కృష్ణా జలాలను తరలిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 80 శాతం పూర్తయిన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ను పూర్తి చేసి, అక్కడి నుంచి డిండికి గోదావరి జలాలను మళ్లించడమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకానికి నీటి వనరును నిర్ణయించడంలో ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం అంత సులభం కాదని, శ్రీశైలం నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకే రెండు టీఎంసీల నీటిని తీసుకునే పరిస్థితి లేదని అన్నారు. ఎల్లూరు పంపుహౌస్‌ నిర్మాణ డిజైన్‌ను ఓపెన్‌ కట్‌ నుంచి అండర్‌గ్రౌండ్‌కు మార్చడం వల్ల నీటి తరలింపులో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే స్థాయిని 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెంచడంతో పాటు అప్రోచ్‌ చానల్‌ పొడవు 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిపోయిందని తెలిపారు.

సర్వేలు లేకుండా నీటి వనరు ఎలా ఖరారు చేస్తారు?

డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంలో ముందుగా శాస్త్రీయంగా సర్వేలు నిర్వహించి స్పష్టమైన సోర్స్‌ పాయింట్‌ నిర్ణయించాలని కవిత సూచించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిసార్లు సర్వేలు నిర్వహించినప్పటికీ తుది నీటి వనరును ఖరారు చేయలేకపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర సర్వే, స్పష్టమైన ప్రణాళిక లేకుండానే ఏదుల నుంచి నీళ్లు తీసుకువస్తామని ప్రకటిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా డిండి ఎత్తిపోతల పథకానికి నీటి వనరును ఖరారు చేయలేకపోయారని అన్నారు.

బస్వాపూర్‌ నుంచి డిండికి గోదావరి జలాలు మళ్లించాలి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ దాదాపు 80 శాతం పూర్తయిందని, దానిని పూర్తి చేసి మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను తరలించే అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని కవిత సూచించారు. బస్వాపూర్‌ నుంచి ఉల్పరకు సుమారు 110 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని, వేగంగా పనులు చేపడితే నీటి తరలింపు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తే శివన్నగూడెంకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంటుందని, ప్రత్యామ్నాయంగా కొండపోచంపల్లి నుంచి షామీర్‌పేట మీదుగా కూడా గోదావరి జలాలను తరలించవచ్చని వివరించారు.

నదుల అనుసంధానంతోనే ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య మళ్లీ తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకురావడం అత్యవసరమని కవిత పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, జిల్లాలో అవసరమైన చోట్ల కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని సూచించారు. ఈ విషయాన్ని దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం గతంలో గుర్తించారని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా నల్గొండ వరకు నీటిని అందించేలా గతంలోనే కాలువల వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు..

పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

రాష్ట్రంలో 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత ఆరోపించారు. ముందుగా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపుహౌస్‌ను పునరుద్ధరించి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా మారే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు వేయవద్దని సూచించిన ప్రభుత్వం రైతులకు ఎలాంటి పరిహారం అందిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు సాగునీరు, యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిల్లర్ల వద్ద బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ వాటిని మార్కెట్‌లోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవడంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.