27.4 C
Munich
Tuesday, August 4, 2026

శ్రీశైలం దేవస్థానంలో దర్శనాలకు కొత్త విధానం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆగస్టు 15 నుంచి వీఐపి దర్శనాల్లో మార్పులు
48 గంటల ముందే రెఫరల్ లేఖలు తప్పనిసరి
స్లాట్ విధానంలో టికెట్లు
సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్పులు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

శ్రీశైలం దేవస్థానంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల నిర్వహణలో ఆగస్టు 15వ తేదీ నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) శ్రీనివాసరావు ప్రకటించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు దర్శన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీఐపీ దర్శనానికి సంబంధించిన రెఫరల్ లేఖలను దర్శనం తేదీకి కనీసం 48 గంటల ముందే దేవస్థానం కార్యాలయానికి పంపించాలని ఈఓ సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే, అందిన వీఐపీ రెఫరల్ లేఖలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వెంటనే సంబంధిత వారికి మొబైల్ సందేశం (ఎస్‌ఎంఎస్‌) ద్వారా సమాచారం చేరే విధంగా కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

భక్తులు కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, మొత్తం ప్రక్రియను సులభతరం చేయడమే ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశమని ఈఓ వివరించారు. ఈ విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి, దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆమోదంతో అమల్లోకి వస్తోందని తెలిపారు. వీఐపీ దర్శన టికెట్లను ఇకపై స్లాట్ విధానంలో కేటాయించనున్నట్లు వెల్లడించారు. దీంతో వీఐపీ దర్శనాల నిర్వహణ క్రమబద్ధంగా సాగడంతో పాటు, సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా దర్శన సమయాలను పునర్వ్యవస్థీకరించినట్లు పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో శ్రీశైలం దేవస్థానానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దర్శన వ్యవస్థలో ఈ మార్పులు చేపట్టినట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా శని, ఆదివారాలు, సోమవారాలు వంటి అధిక రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనాలకు రోజుకు రెండు విడతల్లో మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం ద్వారా వీఐపీ దర్శనాల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు, సాధారణ భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభవం కల్పించడమే దేవస్థానం లక్ష్యమని ఈఓ తెలిపారు.

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.