19.7 C
Munich
Saturday, August 1, 2026

బీబీపేట బ్రిడ్జిపై ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే ఆందోళన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రాకపోకలకు ఏకైక మార్గమైన వంతెన ప్రమాదకర స్థితిలోనే.
వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ప్రధాన వంతెన (బ్రిడ్జి) శిథిలావస్థకు చేరుకుని చాలా కాలం గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.

ఈ వంతెన బీబీపేట మండలానికి చెందిన తుజాల్పూర్, మల్కాపూర్, ఉప్పరపల్లి, ఈసానగర్, యాదారం, శివారెడ్డిపల్లి, జనగామ, రాంరెడ్డిపల్లి తదితర గ్రామాలకు రాకపోకలకు ప్రధాన మార్గంగా ఉంది. ప్రత్యామ్నాయ రహదారి లేకపోవడంతో ఈ ఒక్క బ్రిడ్జిపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో బ్రిడ్జి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వంతెన దెబ్బతింటే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, నిత్యావసర వస్తువులు, రేషన్ బియ్యం, అత్యవసర సేవల రాకపోకలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో సిద్దిపేట, సిరిసిల్ల, దుబ్బాక, నిజాంపేట్, చల్మెడ, మెదక్, రామాయంపేట తదితర ప్రాంతాల మీదుగా సుదూర మార్గంలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై స్పందించిన బీబీపేట ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నరసింహులు మాట్లాడుతూ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, సాధ్యం కాని పక్షంలో అత్యవసర మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజా ప్రతినిధుల పర్యటనలను కూడా అడ్డుకుంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.