కొనుగోలుదారులకు ఊరట
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం కూడా పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే బంగారం ధర వేల రూపాయలు తగ్గగా, వెండి ధర సైతం గణనీయంగా దిగివచ్చింది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లయింది.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముడిచమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థలో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్ల తీరు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా డాలర్ విలువ, వడ్డీ రేట్లపై అంచనాలు కూడా పసిడి ధరల కదలికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్సైట్ వివరాల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,480గా ఉండగా, శుక్రవారం నాటికి ఏకంగా రూ.5,320 తగ్గి రూ.1,28,160కు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,800గా నమోదైంది.
వెండి ధరలోనూ భారీ పతనం……..
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్లో గురువారం కిలో వెండి ధర రూ.1,64,865గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.9,965 తగ్గి రూ.1,54,900కు చేరుకుంది. ఒక్కరోజులోనే వెండి ధరలో ఇంతటి తగ్గుదల నమోదవడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరుసగా పెరుగుతూ సామాన్యులకు భారంగా మారిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల ప్రవాహం, డాలర్ బలపడటం లేదా బలహీనపడటం వంటి అంశాల ఆధారంగా రానున్న రోజుల్లో ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

