నవంబర్ 11 నుంచి 13 వరకు నిర్వహణ..
ఠాగూర్ స్టేడియం, సింగరేణి హైస్కూల్ మైదానాల్లో పోటీలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గాను కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలను మందమర్రి ఏరియాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో నవంబర్ 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.
రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంతో పాటు మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో సింగరేణి సంస్థకు చెందిన అన్ని ఏరియాల క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకోనున్నారు. వివిధ ఏరియాల జట్ల మధ్య జరిగే ఈ పోటీలు క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని పంచనున్నాయి.
సింగరేణి సంస్థ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీజీఎం (పర్సనల్) సురేందర్ తెలిపారు. క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన తన ప్రకటనలో కోరారు.

