బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్పుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, బీసీ కులగణనను పారదర్శకంగా నిర్వహించి జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికి న్యాయం చేయాలని ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్ చేశారు.ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చే అంశాన్ని పరిశీలించి, అర్హత కలిగిన ముద్రాజ్ సోదరులకు న్యాయం చేయాలని కోరారు. బీసీ కులాల్లో ఏ కులానికి ఎంత జనాభా ఉందో సమగ్రంగా లెక్కించి, ఆ వివరాల ఆధారంగా రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ పదవులు కల్పించాలని సూచించారు. కులగణనలో ఏ ఒక్క బీసీ కులానికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
జనాభా నిష్పత్తి ఆధారంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలతో పాటు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. బీసీల్లోని అన్ని కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ముద్రాజ్ కులస్తులు సంప్రదాయంగా పనిముట్లు, పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని, వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో మూడు ఎకరాల భూమి కేటాయించి, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహించాలని కోరారు. జామ, ఇతర పండ్ల సాగుకు అవసరమైన మొక్కలు, పనిముట్లు, ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా బీసీ బంధు పథకాన్ని అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి అందించాలని, బీసీ కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు సాధారణ మరణమైనా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించే విధంగా ప్రత్యేక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం కులగణనను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా, దాని ఆధారంగా ప్రతి కులానికి సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని కొరివి నర్సింలు కోరారు. బీసీ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నిర్ణయాలు తీసుకోవాలని బీబీపేట మండలం నుంచి విడుదల చేసిన ప్రెస్నోట్లో ఆయన పేర్కొన్నారు.

