కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పట్టణ పరిధిలోని ఆటో డ్రైవర్లు రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మందమర్రి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) సూచించారు. ముఖ్యంగా ఆటోలకు ఏర్పాటు చేసిన సైడ్ మిర్రర్లను లోపలికి మడిచి ఉంచడం, సరిగ్గా అమర్చుకోకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆటోలకు ఇరువైపులా ఉన్న సైడ్ మిర్రర్లు బయటికి ఉండేలా, వెనుక నుంచి వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించే విధంగా సరిగా అమర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మలుపులు తిరిగే సమయంలో, ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే సందర్భాల్లో సైడ్ మిర్రర్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్సై సూచించారు. సైడ్ మిర్రర్లు లేకుండా లేదా వాటిని సక్రమంగా ఉపయోగించకుండా వాహనాలు నడిపే వారిపై, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ఆటో డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లు పోలీసులకు సహకరిస్తూ, రహదారి భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్సై కోరారు.

