హైదరాబాద్ సంస్థానం చరిత్రలో కీలక మలుపు
డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని టీఎంజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. సెప్టెంబర్ 17 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, హైదరాబాద్ సంస్థానం చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిన రోజని పేర్కొన్నారు. అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం పాలకుడిగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని విస్తరించి ఉండేదని వివరించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం వెంటనే భారత యూనియన్లో విలీనం కాలేదని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వం స్వతంత్రంగా కొనసాగేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో సంస్థానంలోని ప్రజల్లో ప్రజాస్వామ్య హక్కులు, రాజకీయ స్వేచ్ఛ, బాధ్యతాయుత ప్రభుత్వం కోసం డిమాండ్లు బలపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ సంస్థాన చరిత్రను కేవలం ఒక రాజకీయ పరిణామంగా మాత్రమే చూడకూడదని ఆయన అన్నారు.
ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ హక్కుల కోసం సాగిన ఉద్యమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం జరిగిన పోరాటాలను కూడా తెలంగాణ చరిత్రలో భాగంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలను, ఆ కాలంలో చోటుచేసుకున్న వివిధ ప్రజా ఉద్యమాలను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారా అప్పటి సామాజిక, రాజకీయ పరిణామాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

