500 ఎకరాలకు పైగా విస్తీర్ణం..
ఏడు గ్రామాల రైతులకు ఆధారం
బీబీపేట ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేటలో 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న చారిత్రక చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని బీబీపేట ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు, మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ డిమాండ్ చేశారు. నైజాం కాలం నుంచి ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉందని వారు తెలిపారు. తూజాల్పూర్, ఇస్సానగర్, ఉప్పర్‌పల్లి, చైర్మన్ బీబీపేట, యాడారం, నస్కల్, రాంపూర్‌తో పాటు బీబీపేట పట్టణానికి చెందిన రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
గొలుసుకట్టు చెరువుల వ్యవస్థలో భాగంగా ఉన్న ఈ చెరువులో నీరు పూర్తిస్థాయిలో నిల్వ ఉంటే ఏడు గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు.గతంలో బీబీపేట తమలపాకు తోటలకు ప్రత్యేక గుర్తింపు పొందిందని నర్సింలు గుర్తుచేశారు. సుమారు 35 సంవత్సరాల క్రితం బీబీపేటలో పండించిన తమలపాకులు ప్రత్యేకంగా తట్టల్లో ప్యాక్ చేసి లారీల ద్వారా కలకత్తా వరకు తరలించేవారని తెలిపారు. బీబీపేట తమలపాకులకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేదని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి కొనుగోలు చేసేవారని చెప్పారు. ఒకప్పుడు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న తమలపాకు తోటలు ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీబీపేటకు చారిత్రక ప్రాధాన్యతతో పాటు దుబ్బాక, సిద్దిపేట, రామాయంపేట, సిరిసిల్ల తదితర ప్రాంతాలతో రవాణా సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా చెరువుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో పాటు చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. గతంలో తాను కూడా తమలపాకు తోటల్లో పనిచేసిన సందర్భాలు ఉన్నాయని కొరివి నర్సింలు తెలిపారు. తమలపాకు తోటలను ఎంతో జాగ్రత్తగా, పరిశుభ్రతతో నిర్వహించేవారని, అలాంటి గొప్ప సంపద ఇప్పుడు కనుమరుగవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీబీపేట చెరువు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి బ్రిడ్జి, మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

