ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఎందుకు విభేదించినట్టు ?
గతంలో బిర్ఎస్ తో స్నేహం
మొన్నటి వరకు మంచిర్యాల ఎమ్మెల్యేతో
కవిత పార్టీలో చేరికకు ప్రయత్నాలు విఫలం
నేడు మంత్రి వివేక్ తో
ఎమ్మెల్యే పదవిపై ఆశలు
కోవర్టు రాజకీయమంటున్న రాజకీయ వర్గాలు ?
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి జగన్ మోహన్ రావ్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
మంచిర్యాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నాటికీ ఆయన పేరు, పలుకుబడి అంతగా ఎవరికీ తెలియదు. ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావ్ విజయం సాధించడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి జగన్ మోహన్ రావ్ పేరు జిల్లా అంతటా అతి కొద్దీ రోజుల్లోనే వ్యాపించింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరుడిగా ముద్ర పడింది. ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ మోహన్ రావ్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు అండగా నిలిచారనే పేరుంది. ప్రభుత్వ శాఖల్లో కూడా జగన్ మోహన్ రావ్ జోక్యం మితిమీరిందనే ఆరోపణలు ఉన్నవి. ఇద్దరి మధ్య తేడాలు రావడంతో బంధం విడిపోయింది. గత ఆరునెలలకు పైగా ఎమ్మెల్యే గడప తొక్కడం లేదు జగన్. గత కొద్దీ రోజుల నుంచి అయన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఒక దశలో చెప్పాలంటే ప్రేమ్ సాగర్ రావ్ కు సవాల్ విసురుతున్నట్టుగా ఆయన ప్రవర్తన కనబడుతోంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను ఎదుర్కొని మంత్రి వివేక్ అండతో ఎమ్మెల్యే కావాలనే ఆశల పల్లకిలో జగన్ మోహన్ రావు ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జగన్ మోహన్ రావ్ మొదట గులాబీ నేతలతో స్నేహం కొనసాగింది. ఆ సమయంలో ఆయన పేరు మంచిర్యాల జిల్లాలో అంతగా వినబడలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రేమ్ సాగర్ రావ్ తో బంధం ఏర్పడింది. సుమారు ఏడాదిన్నర పాటు ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగింది. అనారోగ్యకరమైన వాతావరణం రావడంతో జగన్ మోహన్ రావ్ ను ఎమ్మెల్యే పక్కకు పెట్టారనే ప్రచారం వచ్చింది. ఎందుకు పక్కకు పెట్టింది అనే విషయాన్నీ ఎమ్మెల్యే చెప్పడం లేదు. నా అనుచరుడుడు కాదు, అవును అనే విషయాన్నీ కూడా ఎమ్మెల్యే చెప్పడంలేదు. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న జగన్ కూడా ఎందుకు విడిపోయానమేది నేటికీ వెల్లడించలేదు. ఎమ్మెల్యేతో విభేదాలు ఏర్పడిన తరువాత ఆయన కవిత పార్టీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి.
తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోడానికే జగన్ మంత్రి వివేక్ తో చేయి కలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి బలమైన అండ కావాలి కాబట్టి జగన్ మంత్రి వివేక్ దారిని ఎంచుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ అటు, ఇటుగా చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నిమంత్రి సమర్థిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిందే. ఎందుకంటే చెన్నూర్ కాంగ్రెస్ నేతలు కొందరు జగన్ ను పరోక్షంగా విమర్శించిన సందర్భాలు సైతం ఉన్నవి. ఈ నేపథ్యంలో జగన్ ను ఎంతవరకు మంత్రి వివేక్ బుజాన ఎత్తుకుంటారో కూడా వేచిచూడాల్సిందే.
వాస్తవానికి వెలమ సామజిక వర్గంలో ఒక సారి ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడి బంధం ఏర్పడితే ఆ బంధం విడిపోదు. ఇక్కడ జగన్ మంత్రి అండ కోసం వెళ్లడంపై కూడా రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దండేపల్లి లో ఎంపీ వంశీ పర్యటన గొడవలకు దారి తీసింది. ఆ గొడవలకు ముందే ఎమ్మెల్యే తో జగన్ దూరమైనాడు. ఆ గొడవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు నియోజక వర్గంలో కొంత పట్టు తప్పినట్టు అనిపించింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే దూరం పెట్టాడో అప్పుడే జగన్ మంత్రి శిభిరంలో ఎందుకు చేరలేదు, గొడవ అనంతరం ఎందుకు మంత్రి దారి ఎంచుకున్నాడు అనే అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అయితే ఇన్ని రోజులు ఎందుకు తటస్తంగా ఉన్నాడనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మంత్రి అండ ఉంటె ఒకవైపు రాష్ట్రంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు, మరోవైపు మంత్రి ఇలాకాలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి శిభిరంలో జరిగే విషయాలను తెలుసుకోడానికే విభేదించినట్టుగా ఈ “జగన్నాటకం” అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా జగన్ వెంట పెద్ద మొత్తంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్లు వెళుతున్నారనే ప్రచారం గుప్పుమంది. దీన్ని పసిగట్టిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ పలువురు కార్పొరేటర్లను పిలిపించి మాట్లాడినట్టుగా సమాచారం. వెళితే జగన్ వెంట వెళ్ళండి. నాకేమి రాజకీయ ఇబ్బంది లేదు. నష్టం అంతకూ లేదు. మీకు వెళ్ళడానికి ఖర్చుల కోసం ఒక్కరికి యాబై వేల రూపాయలు కూడా ఇస్తాను అని సెలవివ్వడం కొసమెరుపు.

