ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో అభిమానులకు కీలక సందేశం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
నటుడు అల్లు అర్జున్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈరోజు అభిమానుల మధ్య ఉండటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొంటూ, తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా అభిమానులకు విలువైన సూచనలు చేసిన బన్నీ, “మీ ఉత్సాహాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. ఈ మాట కేవలం నా అభిమానులకే కాదు, నన్ను ద్వేషించే వారికీ చెప్పాలనుకుంటున్నాను. ఎవరిపైనా విమర్శలు చేయడం ఎప్పుడూ సరైన పద్ధతి కాదు” అన్నారు.
“మనకు నచ్చని వ్యక్తుల కోసం మన డబ్బు ఖర్చు పెట్టం. అలాగే మన సమయం, శక్తి కూడా ఎందుకు వృథా చేయాలి? సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌కు స్పందిస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, అదే సమయాన్ని మీ వ్యక్తిగత ఎదుగుదలకు వినియోగించండి. మీకు నచ్చిన పని చేయండి. జీవితాన్ని ఆనందంగా గడపండి. కానీ ఎవరినీ ట్రోల్ చేయకండి” అని అభిమానులకు సూచించారు.
అలాగే, “ప్రతి మనిషికి ఒక రోజులో 100 శాతం సమయం, శక్తి ఉంటుంది. దానిని దేనికి వినియోగిస్తామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అభిమానుల సమావేశంలో బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.

