30.2 C
Munich
Wednesday, July 29, 2026

దిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ నేడు.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు,
మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు,
డీసీసీ అధ్యక్షుల మార్పులపై కీలక చర్చలు

కోల్ బెల్ట్ న్యూస్,ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నేడు దిల్లీలో జరగనుండటంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాల అంశం ప్రధానంగా చర్చకు రానుంది. ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ ఒకరిద్దరి పేర్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరక ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం. వీలైనంత త్వరగా నియామకాలను ఖరారు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోహిన్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, ఫహీమ్ ఖురేషి పేర్లు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అదే విధంగా మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను ఏ సామాజిక వర్గాలకు కేటాయించాలనే అంశంపై కూడా సమగ్రంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కొందరు మంత్రుల పనితీరు, ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా సమావేశంలో సమీక్ష జరిగే అవకాశమున్నట్లు సమాచారం.

ఇక రాష్ట్రంలోని కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ అంశంపైనా నాయకత్వం సమాలోచనలు చేయనుంది. దాదాపు 50 కార్పొరేషన్ చైర్మన్ పదవులకు అర్హులైన నాయకుల జాబితా ఇప్పటికే సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోని రెండు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను వెంటనే మార్చాలని అధిష్ఠానం సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై కూడా సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా నేటి సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.