NIGAMA MEDIA (P) LTD
15 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, August 8, 2026

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మందమర్రిలో రెండో రోజు కొనసాగిన ‘ప్రజా పోరు’ పాదయాత్ర
ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతర పోరాటం
సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ, ప్రజలపై పన్నుల భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతం నుంచి రెండో రోజు ప్రారంభమైన ‘ప్రజా పోరు’ పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు లభించేలా ధరలను నియంత్రించాలని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

రెండో రోజు పాదయాత్ర మందమర్రి పాత బస్టాండ్ నుంచి ఇందిరానగర్, విద్యానగర్, ఎస్సీ–ఎస్టీ కాలనీ, బుర్రగూడెం, అంధుగులపేట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను విస్మరించి నిరంకుశ, ఫాసిస్టు విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. నల్లధనం వెలికితీత, ప్రతి ఏడాది కోటి ఉద్యోగాల కల్పన, ప్రజలపై పన్నుల భారం తగ్గింపు వంటి హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు, వినియోగదారులను కార్పొరేట్ కంపెనీల ఆధీనంలోకి నెట్టే ప్రయత్నం జరిగిందని, అయితే ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని బలవంతం చేసిందని గుర్తు చేశారు. అలాగే నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై యువత చేసిన ఉద్యమం కూడా విజయవంతమైందని పేర్కొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తూ ప్రజా ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని ఆరోపించారు.

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ కార్మికులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ కుబేరులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు.

దేశ సరిహద్దుల్లో ప్రాణత్యాగాలు చేస్తున్న సైనికుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం సరికాదని, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించాలని పిలుపునిచ్చారు. మార్పు కోసం సీపీఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజా పోరు పాదయాత్ర ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ ఉద్యమాలు కొనసాగిస్తుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి స్వయం ప్రతిపత్తి పాలన అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వార్డుల్లో నెలకొన్న మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శైలేంద్ర సత్యనారాయణ కోరారు. పాదయాత్రలో పాల్గొన్న సుమారు 30 మంది కార్యకర్తలను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు ఇప్పకాయల లింగయ్య, చెన్నూరు నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు, మండల నాయకులు మనం సత్యనారాయణ, కాదండి సాంబయ్య, పట్టణ నాయకులు రాయబారపు వెంకన్న, ఎండి రసూల్, జెట్టి మల్లయ్య, ఎగుడ మొండి, తాళ్లపెల్లి వీరయ్య, దొంతుల రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.