Home » బీబీపేట్ వంతెనపై పెరుగుతున్న ప్రమాదం..

బీబీపేట్ వంతెనపై పెరుగుతున్న ప్రమాదం..

చిన్నపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం
ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి
మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బీబీపేట్ మండలంలోని ప్రధాన వంతెన గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు శాశ్వత చర్యలు చేపట్టలేదని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది చెరువు కట్ట వద్ద నిల్వ నీరు అధికమవడంతో మత్తడి ద్వారా నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. వరద ఉద్ధృతికి తుమ్మముళ్ల చెట్లు కొట్టుకువచ్చి వంతెనకు అడ్డంగా పడటంతో వరద నీరు వంతెనపై నుంచి ప్రవహించి వంతెన తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. అప్పటి నుంచే సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ప్రస్తుతం చిన్నపాటి వర్షాలకే వంతెనపై వరద నీరు ప్రవహించే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారీ వరదలు వస్తే ఈ వంతెన పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని, అప్పుడు కొత్త వంతెన నిర్మాణానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అన్నారు.

అందువల్ల ప్రస్తుతం ఉన్న వంతెనకు సమాంతరంగా వెంటనే కొత్త ఫోర్‌లేన్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ వంతెన వేములవాడ, రాజన్న సిరిసిల్ల, రామంపేట, సిద్ధిపేట, దుబ్బాక తదితర ప్రాంతాలకు ప్రధాన రాకపోకల మార్గమని తెలిపారు. వంతెన దెబ్బతినడం వల్ల పూజాల్పూర్, తుజాల్పూర్, మల్కాపూర్, ఇస్సానగర్, ఉప్పర్‌పల్లి, జనగామ, యాడారం, కోనాపూర్, శివరామరెడ్డిపల్లి, చేర్యాల, బీబీపేట్ తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలని కోరారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *