NIGAMA MEDIA (P) LTD
4.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 31, 2026

మంచిర్యాలలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కార్మికుల హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాలే మార్గం
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. భారతదేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఐక్య వేదిక అవసరమనే లక్ష్యంతో 1920 అక్టోబర్ 31న అప్పటి బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆవిర్భవించిందని తెలిపారు. దేశంలో ఏర్పడిన తొలి జాతీయ స్థాయి కార్మిక సమాఖ్యగా ఏఐటీయూసీ గుర్తింపు పొందిందన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ తొలి అధ్యక్షుడిగా, దివాన్ చమన్‌లాల్ తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు.

బ్రిటిష్ పాలన కాలంలో కార్మికులు తక్కువ వేతనాలు, రోజుకు 12 నుంచి 16 గంటల పని, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కార్మికులను సంఘటితం చేసి సమ్మెలు, నిరసనలు, ఉద్యమాల ద్వారా వారి హక్కుల సాధనకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడిందన్నారు. ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, పెన్షన్, వేతనంతో కూడిన సెలవులు, మహిళా కార్మికుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ విస్తరణ, శాశ్వత ఉద్యోగాల తగ్గింపు, కార్మిక చట్టాల్లో మార్పులు, కనీస వేతనాల సమస్యలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పెన్షన్, వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు.

సింగరేణి బొగ్గు గనులతో పాటు వివిధ పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కుల పరిరక్షణకు, కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగేలా, మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ అనంతర సంక్షేమం కోసం కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతే బలమని, సంఘటిత పోరాటమే హక్కుల సాధనకు మార్గమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కలిందర్ అలీ ఖాన్, ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, లింగం రవి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ అధ్యక్షులు మామిడిపల్లి శ్రీనివాస్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు రాజేశం, గోలి శంకర్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమల, దేవి పోచన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.