NIGAMA MEDIA (P) LTD
23.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

బోనాల పండుగ.. 600 ఏళ్ల చరిత్ర..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

తెలంగాణ సంస్కృతికి శాశ్వత చిహ్నం
భక్తి,సంప్రదాయం,సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా బోనాల మహోత్సవం

కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అత్యంత ప్రాచీన జానపద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో బోనాల పండుగకు విశిష్ట స్థానం ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం కాలక్రమేణా తెలంగాణ ప్రజల జీవన విధానంలో అంతర్భాగంగా మారింది. భక్తి, కృతజ్ఞత, సామాజిక ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ మహోత్సవం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బోనాల పండుగకు పల్లవుల పాలనా కాలంలోనే మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు, కుతుబ్ షాహీ పాలకుల కాలంలో కూడా ఈ ఉత్సవాలకు విశేష ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా కుతుబ్ షాహీల పాలనలో బోనాల వేడుకలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించేవారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

ప్లేగు మహమ్మారి తర్వాత విశేష ప్రాధాన్యం….

ప్రస్తుతం నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు 1869 సంవత్సరం కీలక మలుపుగా భావిస్తారు. ఆ సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను ప్లేగు మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించిన మిలిటరీ బెటాలియన్ జవాన్లు.. మహమ్మారి నుంచి నగరం విముక్తి పొందితే హైదరాబాద్‌లో అమ్మవారికి ఆలయం నిర్మించి బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. అనంతరం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో సికింద్రాబాద్‌లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి, అమ్మవారికి బోనాలు సమర్పించారు. అప్పటి నుంచి ప్రతి ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ముసి వరదతో మరో చారిత్రక ఘట్టం…

1908లో సంభవించిన ముసి నది మహా వరద బోనాల చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలిచింది. ఆ వరదలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, హైదరాబాద్ నగరం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ విపత్తు నుంచి ప్రజలను రక్షించాలని అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. అనంతరం ముసి నదిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరారు. అప్పటి నుంచి లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.

భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా బోనాలు….

బోనాలు కేవలం ఒక జాతర మాత్రమే కాదు. అమ్మవారిపై భక్తి, కృతజ్ఞత, సమాజ ఐక్యత, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన మహోత్సవం. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం చేకూరడమే కాకుండా దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు బోనాల మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ మహోత్సవం రాష్ట్ర సంస్కృతికి చిరస్థాయిగా నిలిచే విశిష్ట సంప్రదాయంగా కొనసాగుతోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.