లీవ్ కోసం వెళితే లూస్ టాక్ చేసిన ఇంజనీర్
కార్మికుల సమక్షములో అసభ్య పదజాలం
గని మేనేజర్ సైతం పట్టించుకోని వైనం
సంఘాల తీరుపై కార్మికుల్లో అసంతృప్తి
Singareni : సింగరేణి విస్తరించిన గనులపై “” ఒకే కుటుంబం…ఒకే లక్ష్యం…ఒకే గమ్యం ” అనే సూక్తి ఉంటుంది. అంటే దీని అర్థం తెలిసిన ఏ అధికారి కూడా తన కింది స్థాయిలో విధులు నిర్వహించే కార్మికులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్ల పై అమర్యాదగా ప్రవర్తించడు. కిందిస్థాయి వారి కంటే రెండు, మూడు తరగతులు ఎక్కువ చదివినంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిచిన నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి కావడంలేదు. కార్మికుడి నుంచి మొదలుకొని గని మేనేజర్ వరకు కష్టపడుతూ ,ఒక కుటుంబం మాదిరిగా, ఒక లక్ష్యంతో పనిచేసినప్పుడే ఎంచుకున్న గమ్యాన్ని చేరుకుంటారు.
ఈ విధంగా గనులపై ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించాల్సిన అధికారుల్లో కొందరు అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే ఆరోపణలు సింగరేణిలో వ్యక్తమవుతున్నాయి. దీన్ని నిర్మూలించాల్సిన కార్మిక సంఘాలు కూడా తమ పబ్బం గడుపుకోడానికి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. కేవలం తమ ఉనికిని చాటుకోడానికే గనులపై పర్యటనలు చేస్తున్నారంటున్నారు. కేవలం ఉత్తర ప్రగల్భాలకే పరిమితమంటున్నారు కార్మికులు. అనారోగ్యవాతావరణాన్ని సృష్టిస్తున్న వారిపై ఉన్నతాధికారులకు, నాయకులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, వాతావరణం మరింత కాలుష్యం అవుతున్నదంటున్నారు కార్మికులు.వివరాలలోకి వెళితే ….
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఒక గని ఇంజనీర్ కు అదే గనికి చెందిన టెక్నీషియన్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఇంజనీరు ఆగ్రహంతో తీవ్రమైన పదజాలంతో దూషించాడు. గని ఆవరణలో కార్మికులందరి సమక్షములో అసభ్యముగా మాట్లాడటంతో వారు కూడా ఆ అధికారి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరు అసభ్యముగా దూషించడంతో ఆ టెక్నీషియన్ చేసేదేమిలేక గని మేనేజర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. న్యాయం జరుగుతుందని ఆశించాడు. ఎంతయినా ” కాకి పిల్ల కాకికి ముద్దు “. అధికారిని అధికారి సమర్ధించుకుంటారు. కింది స్థాయి వారి సమస్య ను ఎందుకు పట్టించుకుంటారు. పైగా గని మేనేజర్ కు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టకుండా ” పని చేయడం చేతకాని వారంతా కూడా గిట్టని వారిపై ఫిర్యాదు చేయడం సాధారణం అయ్యిందంటూ ” సదరు టెక్నీషియన్ పై అసహనం వ్యక్తం చేయడం కొసమెరుపు .

by