బీసీలకు జెండాలు కాదు.. ఎజెండా కావాలి
బీసీలకు 52 శాతం వాటా కల్పించాలి.. పేరం అలేఖ్య డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది పేరం అలేఖ్య మాట్లాడుతూ.. బీసీల సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తానని ముందుకు వచ్చిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం బీసీ ఉద్యమాన్ని పక్కనపెట్టి రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శించారు.
మూడు, నాలుగు సంవత్సరాల క్రితం బీసీల హక్కుల సాధన కోసం కల్వకుంట్ల కవిత ముందుకు వచ్చి, ఆర్. కృష్ణయ్య, తాడూరి శ్రీనివాస్ తదితరులను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాటం చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఈ క్రమంలో బీసీ ఫూలే ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారని తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి భారీ సభలో ప్రసంగించడంతో పాటు, తెలంగాణలో బీసీ ఉద్యమానికి మద్దతుగా రైల్‌రోకోలు, ధర్నా చౌక్‌లో ధర్నాలు వంటి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని బీసీ వర్గాల్లో రిజర్వేషన్ల సాధనపై ఆశలు చిగురించాయని అన్నారు.
అయితే, ప్రస్తుతం బీసీ ఉద్యమాన్ని పక్కనపెట్టి తన తండ్రి స్థాపించిన పార్టీని కాపాడుకోవడం, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయ బలాన్ని పెంచుకోవడంపైనే కల్వకుంట్ల కవిత దృష్టి సారిస్తున్నారని పేరం అలేఖ్య విమర్శించారు. భారీ కాన్వాయ్‌లతో పర్యటనలు చేస్తూ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల ప్రజలు ఇలాంటి రాజకీయాలను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని, డబ్బు ఆశ చూపి చేసే రాజకీయాలకు ఆకర్షితులై మోసపోవద్దని ఆమె కోరారు. బీసీ హక్కుల సాధనకు కట్టుబడి లేని నాయకుల సభలకు బీసీ ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బీసీలకు మూడు ప్రధాన డిమాండ్లు…….
బీసీలకు జెండాలు అవసరం లేదని, తమకు స్పష్టమైన ఎజెండా కావాలని పేరం అలేఖ్య పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, రాజకీయ నాయకుల ముందుంచారు.
- బీసీ కులగణన చేపట్టాలి.
- బీసీలకు 52 శాతం వాటా కల్పించాలి.
- బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, బడ్జెట్లో తగిన వాటా కేటాయించాలి.
కల్వకుంట్ల కవితకు బీసీల సమస్యల పరిష్కారంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఈ మూడు డిమాండ్ల సాధన కోసం చిత్తశుద్ధితో ఉద్యమించాలని పేరం అలేఖ్య కోరారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం సీనియర్ నాయకురాలు కుమ్మరి కోడూరి లీలావతి ప్రజాపతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

