ఒడిశాలో థర్మల్ విద్యుత్ కేంద్రం,
ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణానికి స్థల కేటాయింపుపై చర్చలు
అంగూల్ జిల్లా కలెక్టర్‌ను కోరిన సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని అభివృద్ధితో పాటు సింగరేణి సంస్థ ప్రతిపాదించిన థర్మల్ విద్యుత్ కేంద్రం, నిర్వాసితుల పునరావాస కాలనీ, బొగ్గు రవాణా రహదారుల నిర్మాణానికి అవసరమైన స్థలాల కేటాయింపు, అనుమతుల విషయంలో సహకరించాలని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తార్‌ను కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌తో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సింగరేణికి అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
40 నిర్వాసిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ కాలనీ……..
నైనీ బొగ్గు గని కారణంగా నిర్వాసితులైన 40 కుటుంబాల పునరావాసం కోసం ఆర్ అండ్ ఆర్ (R&R) కాలనీ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని సీఎండీ కోరారు. పునరావాస ప్యాకేజీల అమలు, కాలనీ నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలోనే రిహాబిలిటేషన్ అండ్ పెరిఫెరి అడ్వైజరీ కమిటీ (RPDAC) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు స్థల సేకరణ….
నైనీ బొగ్గు గనికి అనుబంధంగా ఒడిశాలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంస్థ యోచిస్తోంది. ఇందుకోసం తుకుడా, జరపడా గ్రామాల పరిధిలో అనువైన స్థలాన్ని గుర్తించినట్లు సీఎండీ తెలిపారు. ప్రతిపాదిత విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు.
బొగ్గు రవాణాకు బైపాస్ రోడ్ల నిర్మాణం…….
నైనీ బ్లాక్‌లో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సమీపంలోని జరపడా రైల్వే జంక్షన్‌కు తరలించేందుకు చండీపడా–జరపడా గ్రామాల మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. ఈ రహదారి నిర్మాణం కోసం సింగరేణి ఇప్పటికే రూ.35 కోట్లను డిపాజిట్ చేసిందని వెల్లడించారు. ఈ రహదారి కోల్ కారిడార్‌గా అభివృద్ధి చెంది, ఇతర బొగ్గు ఉత్పత్తి పరిశ్రమలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే స్థానిక గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బొగ్గు రవాణా చేపట్టేందుకు మాఝికా బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని తెలిపారు.
సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల నివాసాలకు స్థలం కోరిన సీఎండీ………
ఒడిశాలో సింగరేణి కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ కార్యాలయ నిర్మాణానికి, ఉద్యోగుల నివాస కాలనీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి కేటాయించాలని సీఎండీ కోరారు. దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణికి అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు గౌతమ్ పోట్రు, ఎల్.వి. సూర్యనారాయణ, ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్, నైనీ గని జనరల్ మేనేజర్ బైద్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ సందర్శన……
అంగూల్ జిల్లాలో జిందాల్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సందర్శించారు. దేశీయ బొగ్గు నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసి, దానిని జిందాల్ స్టీల్ పరిశ్రమలో వినియోగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. సింగరేణిలో మూతపడిన భూగర్భ గనుల నుంచి కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేసే అవకాశాలు, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, కేంద్ర ప్రభుత్వ రాయితీలపై నిపుణులతో చర్చించారు. ఈ సాంకేతికతను సింగరేణిలో అమలు చేసే అవకాశాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. జిందాల్ ప్లాంట్‌కు సింగరేణి నైనీ గని నుంచి కూడా కొంత బొగ్గు సరఫరా అవుతుండటం విశేషం.


