రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో రజకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. బుధవారం మందమర్రిలోని సీఐటీయూ బ్రాంచ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం 26వ ఆవిర్భావ వార్షికోత్సవంలో ఆశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంఘం ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆవిర్భావ సభలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రజక వృత్తిదారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన కోరారు. ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణం, రజక వృత్తిదారులకు రూ.10 లక్షల రుణాలు, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు రజకుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఉన్న రజక వృత్తిదారులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని ఆశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రజకుల జీవితాల్లో ఆశించిన మార్పు రావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించడం వల్ల రజకులు అభివృద్ధికి దూరమవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం రజకుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, హామీల అమలుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రజక వృత్తిదారుల సంఘం నాయకులు పాయిరాల రాములు, మందమర్రి పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్, ఉపాధ్యక్షులు బండి పాపయ్య, ముష్కి చందర్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సాంబారు వెంకటస్వామి, కొత్తకొండ నరసయ్య, మండల అధ్యక్షుడు పైతార ఓదేల్, బాలయ్య, సంగెపు హనుమంతు, గుడికందుల సమ్మయ్య, తరిగొప్పుల భాగ్య, జాలిగం రాజేశ్వరి, తోటపల్లి కళావతి, మాజీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రాజమల్లు, చంద్రగిరి రమేష్, తోటపల్లి రమేష్, తంగేళ్లపల్లి కనకయ్య, రాంబాబు, గుడికందుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

