NIGAMA MEDIA (P) LTD
-1.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 29, 2026

రబీ సాగుపై రైతుల అయోమయం తొలగించండి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నీటి లభ్యతపై స్పష్టత ఇవ్వాలి..
సాగు సాధ్యం కాకుంటే పెద్దపల్లిని కరువు ప్రాంతంగా ప్రకటించాలీ
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

రబీ సాగు సీజన్ ప్రారంభమైనప్పటికీ సాగునీటి లభ్యతపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో పెద్దపల్లి ప్రాంత రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వరి విత్తనాలు వేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారని, ఈ పరిస్థితిపై అధికారులు తక్షణమే స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆదివారం పెద్దపల్లిలో మాట్లాడుతూ.. రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారని, అయితే పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. రైతులు వరి సాగు చేపడితే ప్రభుత్వం అవసరమైన మేరకు సాగునీటిని సరఫరా చేస్తుందా? ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలు ఎంతవరకు ఉన్నాయి? పంటల సాగుకు సరిపడా విద్యుత్ సరఫరా ఉంటుందా? అనే అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమగ్ర వివరాలను వెల్లడించాలని కోరారు.

రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు ప్రారంభించిన తర్వాత నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులను అయోమయానికి గురిచేయడం సరైన విధానం కాదన్నారు. సాగుకు అనుకూల పరిస్థితులు లేనప్పుడు రైతులను వరి సాగు చేయవద్దని సూచించే ముందు ప్రత్యామ్నాయ పంటలు, వాటికి అవసరమైన సదుపాయాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు.

ఒకవేళ ఈ రబీ సీజన్‌లో సాగునీరు అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వం వెంటనే పెద్దపల్లి ప్రాంతాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాగు చేయలేని రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించడంతో పాటు, రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.రైతుల జీవనాధారమైన వ్యవసాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా, సాగునీరు, విద్యుత్ సరఫరా, నీటి నిల్వల వివరాలపై అధికారిక ప్రకటన చేయాలని ఆయన అన్నారు. రబీ సీజన్ కీలక దశకు చేరకముందే అధికారులు స్పందించి రైతుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని, రైతులకు భరోసా కల్పించేలా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.